Home బాపట్ల మాదకద్రవ్యాల నిర్మూలనపై ఆటో డ్రైవర్లకు అవగాహన

మాదకద్రవ్యాల నిర్మూలనపై ఆటో డ్రైవర్లకు అవగాహన

13
0

చీరాల (DN5 News) : మాదకద్రవ్యాల వలన కలిగే అనర్ధాల గురించి రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆటోలలో అతికించి, ఆటో డ్రైవర్లకు డిఎస్‌పి మోయిన్‌ మంగళవారం అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో ఎస్పీ బి ఉమామహేశ్వర్ (B Umamaheswar IPS) ఆదేశాల మేరకు పట్టణంలోని సెయింట్ మార్క్స్ (St.Marxes Church) కమ్యూనిటీ హాల్ ఆవరణలో నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, జనసమ్మర్థం గల ప్రాంతాల్లో అవగాహన నిర్వహిస్తుంటామని అన్నారు. అయితే సామాన్య ప్రజలలో సైతం ఈ అంశంపై పూర్తి అవగాహన పెంచేందుకు ఆటోలను ప్రచార వాహనాలుగా ఎంచుకున్నామని అన్నారు. ఆటోలలో నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, ఆటో లోపల, బయట అతికించిన పోస్టర్ల ద్వారా ప్రయాణికులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి సమాచారం సులభంగా చేరువవుతుందని అన్నారు.

ఈ వినూత్న మార్గం ద్వారా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ లేని సమాజం కోసం ఆలోచిస్తారనే సదుద్దేశంతో చేపట్టామని తెలిపారు. ఆటో డ్రైవర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి వారు సమాజ రక్షణలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఎక్కడైనా గంజాయి సేవించినా లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్లు 1972, 112 లేదా స్థానిక పోలీసులకు అందించాలని సూచించారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎస్పీ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రజల నుండి పూర్తి సహకారం లభిస్తే ఆశించిన లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో చీరాల 1టౌన్ సిఐ ఎస్ సుబ్బారావు, ఎస్ఐలు, సిబ్బంది, ఈగల్ (Eagel Team) టీం, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.