Home బాపట్ల వలస కార్మికులకు శక్తి యాప్‌పై అవగాహన

వలస కార్మికులకు శక్తి యాప్‌పై అవగాహన

15
0

చీరాల (Chirala) : ఎస్పీ బి ఉమామహేశ్వర్ (Umamaheswar, IPS)ఆదేశాల మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ ఆధ్వర్యంలో చీరాల వన్ టౌన్ సిఐ సుబ్బారావు సూచనలతో సబ్ డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. జాండ్రపేటలోని కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్‌ ఆయిల్ లిమిటెడ్ (కేపాల్‌) పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి శక్తి బృందం కానిస్టేబుల్ కె సుబ్బారావు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు వారి మాతృభాషలోనే భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా భద్రతకు స్థానికంగా ఉన్న చట్టాలు, ప్రభుత్వం అందిస్తున్న రక్షణ చర్యల గురించి వివరించారు.

కార్మికులు అపరిచిత ప్రాంతంలో ఉన్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. అత్యవసర సమయాల్లో మహిళలు, ఇతర కార్మికులు తమ రక్షణ కోసం ‘శక్తి యాప్’ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరించారు. ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగించడంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య తలెత్తితే ఆ సమస్యను బట్టి 112, 181, 1091, 1098, 1972 వంటి అత్యవసర నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని తెలిపారు. అలా చేసినప్పుడు పోలీసులు ఏ విధంగా స్పందించి తక్షణ సహాయం అందిస్తారనే విషయాలు క్షుణ్ణంగా తెలిపారు. కార్యక్రమంలో కేపాల్‌ కంపెనీ పర్సనల్ మేనేజర్ పి శ్రీనివాసరెడ్డీ, టెక్నికల్ మేనేజర్ సుభాని పాల్గొన్నారు.