Home బాపట్ల ఆటోనగర్ స్థలాలు స్థానికులకే కేటాయించాలి

ఆటోనగర్ స్థలాలు స్థానికులకే కేటాయించాలి

20
0

చీరాల (Chirala) : మండలంలోని ఈపూరుపాలెంలో ఆటోనగర్‌కు (AtoNagar) కేటాయించిన స్థలాలను పరిశ్రమల పేరిట హైదరాబాదు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారికి కేటాయించడం తీవ్ర అన్యాయమని, ఈ చర్యలు రద్దు చేయాలని ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు పి కొండయ్య మాట్లాడారు. గత 40ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అక్రమణ దారులు, ఇసుక మాఫియా బెదిరింపుల నుండి రక్షించుకునేందుకు ఆటోనగర్ సభ్యులు తీవ్రంగా పోరాడారని తెలిపారు. ఈ భూమిపై రెండు కేసులు హైకోర్టులో కొనసాగుతున్నప్పటికీ కోర్టు వ్యవహారాలు పట్టించుకోని బయట జిల్లాల వారికి స్థలాలు కేటాయించడం ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. అప్పటి ప్రజాప్రతినిధుల సహకారంతో రోడ్లు, విద్యుత్ స్తంభాలు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయించామని అన్నారు.

ఎపిఐఐసికి (APIIC) రూ.వేల్లలో చెల్లించామని, హైకోర్టు కేసులు రద్దు చేయించేందుకు పెద్దఎత్తున ఖర్చులు పెట్టామని అన్నారు. చెట్లు, తుప్పలు తొలగించి ఆటోనగర్‌ను శుభ్రం చేసామని తెలిపారు. ఈ స్థలం చీరాల ఆటోమొబైల్ వృత్తిదారులకే కేటాయించినట్లు తెలిపారు. కానీ కొంత మంది బ్రోకర్ల ప్రయోజనాల కోసం బయట వ్యక్తులకు ప్లాట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభ్యత్వం లేని వారికి ఇచ్చిన ప్లాట్లు వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. బయటి వారికి ఇచ్చిన అనుమతులు పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఈపురుపాలెం పంచాయతీ విద్యుత్ మీటర్‌లకు అనుమతులు జారీ చేయరాదని కోరారు. ఆటోనగర్ స్థలాల కోసం డీడీలు, చలానాల రూపంలో భారీ మొత్తం చెల్లించి, కోర్టు కేసుల కోసం కూడా రూ.లక్షలు ఖర్చు చేసిన ఆటోనగర్ సభ్యులకు స్థలాలు కేటాయించాలని స్పష్టం చేశారు. అవసరమైతే భవిష్యత్తులో తీవ్ర ఆందోళనలు చేపట్టాలని హెచ్చరించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి శంకరరావు, ఉపాధ్యక్షులు దావూద్ భాష, పఠాన్ బుడే, రామిరెడ్డి, రామయ్య, బిట్రా పాండురంగారావు పాల్గొన్నారు.