సర్జికల్ స్ట్రయిక్ జరిగినప్పుడు, బాల్‌కోట్ ఉదంతం జరిగినప్పుడు బాలీవుడ్‌కి చెందిన పలు నిర్మాణ సంస్థలు సంబంధిత టైటిల్స్‌ను రిజిష్టర్ చేయించాయి. మొన్న పార్లమెంట్ ఆర్టికల్ 370, 35Aలను క్యాన్సిల్ చేసినప్పుడు కూడా వీటికి సంబంధించిన టైటిల్స్‌ను కొన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థలు రిజిష్టర్ చేయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటన్నికంటే ముందు ఆర్టికల్ 370పై ఓ తెలుగు సినిమా రానుండం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, 35A రద్దు కావడం ఆ అంశంపైనే టాలీవుడ్‌లో సినిమా రానుండటం విశేషం. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయికిరణ్ అడివి ఆర్టికల్ 370 అంశాన్ని స్పృశిస్తూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆది సాయికుమార్, సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, మనోజ్ నందం, అబ్బూరి రవి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో ఎన్.ఎస్.జి కమెండోగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతన్నాయి. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
“`ఆపరేషన్ గోల్డ్ ఫిష్` సినిమా కథను సిద్ధం చేయడానికి నాకు మూడేళ్ల సమయం పట్టింది. కాశ్మీరీ పండిట్స్ కుటుంబాలను కలిసి పరిస్థితులను తెలుసుకున్నాను. కొన్నేళ్లుగా వారి హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటాన్ని తెలుసుకున్నాను. వారి సమస్యలను తెలుసుకున్నాను. రాజకీయాలు, దేశభక్తి అనే అంశాలతో పాటు చిన్న ప్రేమకథను కూడా మా సినిమాలో మిళితం చేశాను. 370, 35A ఆర్టికల్స్‌ను మన ప్రభుత్వం రద్దు చేసినప్పుడు చాలా ఆనందమేసింది. ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమిది“ అని దర్శకుడు సాయికిరణ్ అడివి తెలిపారు.