Home ప్రకాశం నాలుగేళ్లుగా నిద్ర పోయారా? వెలుగొండ గుర్తురాలేదా? : మంత్రులు పరుగులపై ఒంగోలు మాజీ ఎంపీ సుబ్బారెడ్డి...

నాలుగేళ్లుగా నిద్ర పోయారా? వెలుగొండ గుర్తురాలేదా? : మంత్రులు పరుగులపై ఒంగోలు మాజీ ఎంపీ సుబ్బారెడ్డి ధ్వజం

506
0

మార్కాపురం : “డాక్ట‌ర్ వైఎస్ఆర్ ప‌నులు ప్రారంభించి 70శాతం పూర్తి చేశారు. మిగిలిన 30శాతం ప‌నిలో గ‌డిచిన‌ నాలుగేళ్లలో పట్టుమని ఆరు కిలో మీటర్ల సొరంగం కూడా తవ్వలేక పోయారు. కనీసం రూ.1500కోట్లు నిధులు ఇవ్వడానికి మీకు చేతులు రాలేదు. మీరు వెలుగొండను పూర్తి చేస్తామంటే ప్రజలు నమ్మడం లేదు.“ అంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సోమవారం ఉదయం మార్కాపురం మండలం సూరేపల్లి నుండి వైవీ ప్రజా పాదయాత్ర ప్రారంభమైంది. కంభం మీదగా సాయంత్రానికి నాగులవరం చేరుకుంది. కంభంలో సుబ్బారెడ్డి ప్రజలతో మాట్లాడారు. మంత్రులు ఇప్పుడు వెలుగొండ కోసం హడావుడి చేయడం ఎన్నికల్లో లబ్ది పొందాలనే దుర్భుద్ధి తప్ప ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం కాద‌న్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రాజెక్టును పూర్తి చేయించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నికరంగా పోరాడుతుందని చెప్పారు.

సూరేపల్లిలో పలువురు ఉపాధ్యాయులు కలిసి సీపీఎస్‌ను రద్దు చేయించాలని వినతి పత్రం ఇచ్చారు. హనుమంతునిపాడు మండలం వేములపాడు, మహ్మదాపురం గ్రామాలను వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని విన్నవించారు. కోమరోలు మండలం అల్లీనగరం మైనార్టీ విద్యార్థులు తమకు స్కాలర్షిప్ అందడం లేదని వాపోయారు. కంభంలో విద్యార్థులు ప్ల కార్డులతో ప్రత్యేక హోదా కావాలని నినదించారు. అందుకోసం పదవిని త్యాగం చేసిన సుబ్బారెడ్డికి అభినందనలు తెలిపారు. సూరేపల్లి పాత రైల్వే గేటును పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. ఇరవై ఏళ్ల నుంచి తాను సొంతిల్లుకు నోచుకోలేదని శ్రీను అనే విక‌లాంగుడు సుబ్బారెడ్డికి మొర పెట్టుకున్నాడు. జగన్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాగానే మంజూరు చేస్తామని హామీనిచ్చారు. పాదయాత్రలో గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, జంకే వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనరెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి, వుడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ సీఎహెచ్ రంగారెడ్డి, సీఎహెచ్ విజయ, రమణమ్మ, సత్యవతి పాల్గొన్నారు.