– ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటన
– ప్రత్యేకించి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మేలు చేసేలా 2020-23 పారిశ్రామిక పాలసీకి సవరణలు
– ఫలించనున్న నెలరోజుల పోరాటం
ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8న ప్రకటించిన 2020-23 నూతన పారిశ్రామిక విధానం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ పాలసీని సవరించాలని, ఇందుకోసం విడుదల చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, పారిశ్రామిక సంఘాలు గళమెత్తాయి. ఈ పాలసీ కారణంగా భవిష్యత్ తరాలు ఎదుర్కోబోయే నష్టాలను అందరికీ కూలంకషంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహక సంఘం ప్రతినిధి వి భక్తవత్సలం వివరించారు. ముందుచూపు లేని నూతన పారిశ్రామిక విధానం 2020-23 శీర్షికతో విశ్లేషణ చేసి వేలాది మందికి చేరవేశారు.
ఆ తర్వాత శాసనసభ్యులు, మంత్రులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యాపారవేత్తలు స్పందించారు. అధికార పార్టీ ఎమ్యెల్యేలు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పత్రికలలో ప్రతిపక్ష పార్టీలు స్పష్టమైన ప్రకటనలు ఇచ్చారు. సోషల్ మీడియాలోను ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి జోక్యం చేసుకొని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసేందుకు ఉపక్రమించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను కలిసేందుకు ఏపీ పరిశ్రమల శాఖ అధికారులు పర్యటనలు చేస్తున్నారు. గత పాలసీ కంటే మరింత ఉన్నతంగా రూపొందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు.