Home ఆంధ్రప్రదేశ్ మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం

మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం

275
0

– మహిళల భాగస్వామ్యంతో ‘దశలవారీ మద్యనిషేధం’ అమలు
– వాలంటీర్లు, ఆశా కార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు
– ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
విజయవాడ(దమ్ము) : ప్రజల కష్టాన్ని పీల్చిపిప్పి చేసే మద్యం వ్యసనాన్ని సామాజిక దురాచారంగా పాటించి, దాన్ని నిర్మూలించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పయనిస్తోందని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మద్యం రహిత ఆంధ్రప్రదేశ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటీ ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రసాదంపాడులోని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో కమిటీ వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా కమిటీ సభ్యులుగా ఉన్న వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు హాజరై మాట్లాడారు.

అనంతరం విలేకరుల సమావేశంలో లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహనరెడ్డి పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత మద్యం పాలసీలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయగల సత్తా, మొండిధైర్యం ఉన్న నేత వైఎస్ జగన్ మోహనరెడ్డి అని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే దశలవారీ మద్య నిషేధం అనే సాహసోపేత నిర్ణయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. జనానికి మంచి చేయాలనే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ఎన్నికల అజెండా ‘నవరత్నాలు’తో పాటు మద్య నియంత్రణ సూత్రాలను రాష్ట్రంలో శరవేగంగా అమలు చేస్తున్నారని, మద్య విమోచన ప్రచార కమిటీ నియామకంతో పాటు మద్య వినియోగం తగ్గింపునకు అవసరమైన చర్యలన్నీ అమలవుతున్నాయని లక్ష్మణరెడ్డి వివరించారు.

రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆదాయ వనరైన మద్యం అమ్మకాలను ముఖ్యమంత్రి త్యజిస్తున్నాడంటేనే ప్రజాసంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవచ్చన్నారు‌. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచుతానని నాడు ఎన్నికల ప్రచారంలోనే చెప్పిన మాటలను సీఎం జగన్ నేడు పాటిస్తూ మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయివేటు వ్యక్తుల కనుసన్నల్లో పనిచేసిన మద్యం దుకాణాలను నేడు ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని, దుకాణాల సంఖ్యను భారీగా తగ్గింపు చేసిందన్నారు. ఎన్టీఆర్ హయాంలో విధించిన మద్యనిషేధానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లుపొడిచిందని లక్ష్మణరెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపిందని అన్నారు. నాడు చంద్రబాబు బెల్టుషాపుల ద్వారా మద్యం వ్యసనాన్ని ప్రజల చెంతకు చేర్చగా నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెల్టుషాపులను సమూలంగా తొలగించి మద్యం వ్యసనాన్ని ప్రజలకు దూరం చేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ కేంద్రాలు సమర్ధమంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా చాలామందిలో మద్యం వ్యసనం దూరమైందన్నారు. మగాళ్ల సంపాదన భార్యాబిడ్డలకు వెచ్చించడం, తద్వారా పచ్చని సంసారాలు సాగిస్తున్నామంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఆడపడుచులు జగనన్నను మెచ్చుకుంటున్నారని లక్ష్మణరెడ్డి వెల్లడించారు.

మద్య విమోచన కమిటీ ఆధ్వర్యంలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు ముమ్మరమయ్యాయని చెప్పారు. 2018-19లో చంద్రబాబు పాలనలో మద్యం 384లక్షల కేసులు, బీరు 227లక్షల కేసులు వినియోగం కాగా 2019-20లో జగన్ మోహన్ రెడ్డి పాలనలో మద్యం 289 లక్షల కేసులకు, బీరు వినియోగం 204లక్షల కేసులకు మాత్రమే వినియోగమయ్యాయని చెప్పారు. 30శాతం మద్యం,60శాతం వినియోగం తగ్గిందన్నారు. ప్రతి ఏటా 20శాతం మద్యం షాపులను తగ్గించుకుంటూ వెళ్లి, ఐదో ఏడాది కేవలం త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేసేలానే ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. మద్యం అక్రమాలపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో వంటి స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. త్వరలో మద్య విమోచన ప్రచార కమిటీలను రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలలో ఏర్పాటు చేసి దశలవారీ మద్యనిషేధ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. 90లక్షల మంది డ్వాక్రా మహిళలు, 4 లక్షల మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో మద్యరహిత ఆంధ్రప్రదేశ్ సుసాధ్యమవుతుందన్నారు. సమావేశంలో డిస్టలరీస్ కమిషనర్ డి వాసుదేవరెడ్డి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామకృష్ణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ అరుణకుమారి, సెర్ప్ ఆర్డీ జి ప్రకాశరావు, ఎస్ఈబీ జాయింట్ కమిషనర్ టి నాగలక్ష్మి తదితరులున్నారు.