వేటపాలెం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పరిధిలో స్వామి వివేకానంద కాలనీ శంకుస్థాపన సభలో మాట్లాడారు. సభకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. సభలో మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు మాట్లాడుతూ వేటపాలెం స్ట్రెయిట్ కట్ వద్ద రూ.12.8కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని,రూ.15.17కోట్లతో పుల్లయిపాలెం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. వేటపాలెం షాపింగ్ కాంప్లెక్లను ప్రారంభించారు. రాష్టంలోనే చీరాల నియోజకవర్గం అభివృద్ధి పధంలో ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 9.40లక్షల ఇల్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉండే ప్రాంతం చీరాలని కొనియాడారు. మున్సిపల్ శాఖ కూడా దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. 71ఏళ్ల స్వతంత్రంలో మున్సిపల్ శాఖ విధులలో అనేక మార్పులు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వందన్నారు.
ఎస్సీ ఎస్టీల అబివృద్ధికి రూ.30కోట్ల నిధులు చీరాలకు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పధంలో నడపాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ మొత్తం 1125 ఇళ్లకు శంకుస్థాపన చేశామన్నారు. మొదట 1194 అప్లికేషన్ లు రాగా అర్హులైన1125 మందిని ఎంపిక చేసామన్నారు. డిసెంబర్ 1 నుండి పూర్తిస్థాయిలో ప్రారంభించి మార్చ్ 31న ప్రారంభించడానికి సన్నదం చేస్తామన్నారు. నాణ్యమైన ప్రమాణాలను రూపొందించి ఈ కాలనీని పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, కలెక్టర్ వినాయచంద్, మునిసిపల్ చైర్మన్ మొదడుగు రమేష్ బాబు, ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వేటపాలెం ఎంపీపీ బండ్ల తిరుమలదేవి, మున్సిపల్ కమిషనీర్ ఫజులుళ్ల పాల్గొన్నారు.