డిల్లీ : ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్రప్రభుత్వం ప్రతినెలా ఇస్తున్న గౌరవ వేతనంలో తన వాటాను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ నుండి పెంచుతున్నట్లు ప్రధాని చేసిన ప్రకటన దీపావళి కానుకగా నవంబరులో అమలు కానుంది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో చంద్రబాబు ఈపాటికే అంగన్‌వాడీలకు పెంచిన గౌరవ వేతనం అమలు చేస్తున్నారు. అంగనవాడీ కార్యకర్తల గౌరవ వేతనం రూ.3,000 ఉన్నప్పుడు కేంద్రం రూ.1,800, రాష్ట్రం రూ.1,200 ఇచ్చేవి. అంగనవాడీల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను రూ.1200లకు రూ.7500కలిపింది. దీనికి కేంద్రం ఇస్తున్న రూ.1,800తో కలిపి అంగన్‌వాడీలకు నెలకు రూ.10,500 చేసింది. ప్రధాని తాజా ప్రకటనతో కేంద్రం ఇస్తున్న రూ.1800లకు మరో రూ.1,500 కలిపి ఇవ్వనున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది. కేంద్రం పెంచిన పెంపువల్ల కార్యకర్తలకు పెరిగేదేమీ ఉండదు. కేంద్రప్రభుత్వ వాటా పెంపువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలుగుతుంది.
ఆశా కార్యకర్తలకు మాత్రం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష యోజనల కింద ఉచిత బీమా కల్పిస్తారు. ఆశాలు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ. 4 లక్షల వరకు బీమా పొందగలుతారు.