హైదరాబాద్ : తెలుగు సినీపరిశ్రమలో మూడు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు బెనర్జీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి అటుపై నటుడు అయ్యారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి జంధ్యాల మెమోరియల్ పురస్కారాన్ని అందించనున్నారని తెలుస్తోంది. ఈనెల 28న విజయవాడలో సుమధుర కళానికేతన్స్ బెనర్జీకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది.
జనతా గ్యారేజ్, కిక్, మల్లేశ్వరి, సమర్థుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంటి, కిల్లర్, రక్షణ, గాయం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో బెనర్జీ అద్భుతమైన పాత్రల్లో నటించారు. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లోనూ పలు విభాగాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఈనెల 28న జరగనున్న పురస్కార ప్రధానోత్సవంలో పలు కామెడీ ప్లేలెట్స్ ని ప్లాన్ చేశామని నిర్వాహకులు భాస్కర్ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పలువురు స్టేజీ ఆర్టిస్టులు ఈ వేదికపై హాస్య ప్రధాన స్కిట్ లలో పార్టిసిపెంట్ చేస్తున్నారని తెలిపారు.