బాపట్ల (DN5 News) : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం పిజిఆర్‌ఎస్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రాలను కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్‌కు అందజేశారు. 135 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలో ఉన్న వాటిని అప్పటికప్పుడే ఆయన పరిష్కరించగా, కొన్నిటిని పరిశీలన, మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పిజిఆర్ఎస్‌లో ప్రజలు ఇచ్చిన అర్జీలను అదే రోజు 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే అదే రోజు అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలని సూచించారు. అష్ట కష్టాలు పడి తమ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు తక్షణమే ఊరట లభించాలంటే వేగంగా పరిష్కారం చూపాలన్నారు. ఇలా చేస్తే బాధితులు మోసపోయేందుకు అవకాశం ఉండదన్నారు. ఈ విషయాన్ని గుర్తించి అధికారులు చురుగ్గా పనిచేయాలన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో 127 అర్జీలు పునరావృతం కావడంపై ఏమిటని ప్రశ్నించారు. మరికొన్ని శాఖలోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని, గడువులోగా నాణ్యతతో పరిష్కరిస్తే సమస్యలన్ని తీరిపోతాయన్నారు.
ఐజిఓటి ఆన్ లైన్ శిక్షణలు ప్రతి ఉద్యోగి పూర్తి చేయాలని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్మశాన భూములు లేకుండా ఉన్న ప్రాంతాల వివరాలు నివేదించాలని చెప్పారు. స్మశానాలు లేని ప్రాంతాలలో తక్షణమే భూములు కేటాయించాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలని అన్నారు. నూతన ఓటర్లు నమోదు, తొలగింపులపై వచ్చిన దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






