చీరాల, మార్చి 09 (DN5 News) : ప్రజా సంఘాల పేరుతో సామాజిక కార్యకర్తనని చెప్పుకుంటూ సామాన్య ప్రజలను మానసిక వేదనకు గురిచేస్తున్న శీలం రవి కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు 32వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్‌ఎస్‌లో బాధితులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జాన్‌పేట, జయంతిపేట చెందిన శీలం రవి అనే వ్యక్తి భావప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. స్థానిక ప్రజలకు సంబంధం లేని అంశాలపై అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేస్తూ పనులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం, లేదా ఎవరైనా కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటుంటే అధికారులకు ఫిర్యాదులు చేస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. ప్రజా సంఘాల పేరుతో అధికారులనున, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గోసాల అశోక్, ఆదిశేషు, ఉప్పు సంతమ్మ, తోటపల్లి రూతుమ్మ, సుభాషిణి, అల్లడి స్వరూప పాల్గొన్నారు.






