Home బాపట్ల ఫోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష

ఫోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష

9
0

ఇంకొల్లు (DN5 News) : స్థానిక ఎంఆర్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 15ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు బడుగు వీరయ్యకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.8వేల జరిమాన విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె శైలజ బుధవారం తీర్పు ఇచ్చారు.
అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. 2019లో 15ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి శిక్ష విధించిన విషయాన్ని ఆయన వివరించారు. మండలంలోని భీమవరంకు చెందిన 15ఏళ్ల మైనర్ బాలిక స్థానిక ఎంఆర్‌ఆర్‌ స్కూలులో 10వ తరగతి చదువుతుండగా అదే పాఠశాల హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న కారంచేడు మండలం కొడవలివారిపాలెంకు చెందిన బడుగు వీరయ్య బాలికను పాఠశాలలోని తన చాంబర్ కం బెడ్ రూంకు పిలిపించుకుని చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.

అప్పట్లో బాలిక సంక్రాంతి సెలవులకు తన గ్రామమైన భీమవరం వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ వి రాంబాబు 06/2019 యు/ఎస్‌ 376, 354, 354 (ఎ), 506 ఆర్‌/డబ్ల్యు 34 ఐపిసి, సెక్షన్‌ 6, 9 (ఎఫ్‌) ఆర్‌/డబ్ల్యు 10 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారని తెలిపారు. అప్పటి చీరాల డీఎస్పీ వి శ్రీనివాసరావు దర్యాప్తు ప్రారంభించి, మైనర్ బాలిక, ఫిర్యాదుదారు, ఇతర సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారని తెలిపారు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నిందితుడిపై మోపబడిన అభియోగాన్ని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారని తెలిపారు. నేరస్థలం, బాధితురాలు, నిందితుడి వద్ద సేకరించిన భౌతిక సాక్ష్యాలు నిపుణుల పరిశీలనకు పంపించారని తెలిపారు. నిపుణుల నివేదికలు, ఇతర సాక్ష్యాలతో కలిపి సంబంధిత కోర్టులో చీరాల డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి ఛార్జ్ షీట్ దాఖలు చేశారని తెలిపారు.

ఆ కేసు ఒంగోలు స్పెషల్, పోక్సో కోర్టులో విచారణకు రావడంతో ఎస్పీ బి ఉమామహేశ్వర్ స్వీయ పర్యవేక్షణలో సిఐ వైవి రమణయ్య, ఎస్‌ఐ జి సురేష్, కోర్టు కానిస్టేబుల్ టి నాగేశ్వరరావు సాక్షులు నిర్భయంగా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదు ఇచ్చి సమయానికి కోర్టులో హాజరుపర్చారని తెలిపారు. స్పెషల్ పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు కోర్టులో వాదించి నిందితునిపై మోపబడిన నేరాన్ని తగిన సాక్ష్యాలతో నిరూపించారని తెలిపారు. ఒంగోలు స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె శైలజ సాక్షులు తెలిపిన వాంగ్మూలాలు, దర్యాప్తు అధికారి సేకరించిన భౌతిక ఆధారాలు పరిగణలోకి తీసుకుని నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.8వేల నగదు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి ముద్దాయిని అరెస్లు చేసి, భౌతిక సాక్ష్యాలు కోర్టుకు సమర్పించి, సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్ నిర్వహించి నిందితుడికి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పీపీని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.