Home బాపట్ల జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డు నిర్మించాలి

జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డు నిర్మించాలి

6
0

చీరాల (CHIRALA) : కెజిబివి, ఎపి మోడల్‌ స్కూలు వద్ద జాతీయ రహదారికి అనుబంధంగా సర్వీసు రోడ్డు నిర్మించాలని కోరుతూ ఎపి జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు దమ్ము విజయభాస్కర్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. మీడియా అక్రిడేషన్‌ కమిటీ సమావేశం సందర్భంగా కలెక్టర్‌ను కలిసి ఆ ప్రాంతంలో సమస్యను వివరించారు.

వాడరేవు, పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్నదని, ఈపాటికే వాడరేవు నుండి చీరాల పట్టణం రైలు పట్టాల వరకు రోడ్డు నిర్మాణం పూర్తయినదని తెలిపారు. రైల్వే వంతెన పూర్తి కావాల్సి ఉన్నది. ఈ రోడ్డు వెంబడి ఒంగోలు, కత్తిపూడి జాతీయ రహదారిని వాడరేవు, పిడుగురాళ్ల రహదారి దాటే చోట నిర్మించిన వంతనకు సమీపంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయని తెలిపారు. కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయం, ఎపి మోడల్‌ స్కూల్‌, భవిత దివ్యాంగుల పిజియోథెరఫీ సెంటర్‌ వంటి విద్యా సంస్థలు ఉన్నాయని తెలిపారు.

ఈ విద్యార్ధుల రాకపోకలు సాగించేందుకు నేరుగా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఇచ్చిన మార్గం భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరం అయ్యే పరిస్థితి ఉందని వివరించారు. ఈ రహదారిపై వచ్చే వాహనాలు గంటకు 100కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగంతో వస్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం రోడ్డు అసంపూర్తిగా ఉన్నందున పెద్దగా ట్రాఫిక్‌ మొదలు కాలేదని, రోడ్డు పూర్తయిన తర్వాత ఈ రోడ్డులో వచ్చే వాహనాలు ఎక్కువగా బీచ్‌లో వినోదం కోసం వచ్చే వాళ్లే ఎక్కువ మంది ఉంటారని తెలిపారు. వారి వాహనాలు ఎలాంటి వేగంతో ఉంటాయో అర్ధం చేసుకోగలరని కోరారు.

ఇక్కడ విద్యార్ధులు నేరుగా బైపాస్‌ రోడ్డుపైకి రావడం అంటే అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఆదాయపన్ను శాఖ, రవాణా శాఖ, విద్యా శాఖ వంటి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఈ ప్రాంతలో స్థలం కేటయించి ఉన్నారని తెలిపారు. అంటే భవిష్యత్తులో ఆయా కార్యాలయాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. విద్యా సంస్థల పక్కనే యానాది కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు సరైన దారి లేక ప్రస్తుతం కాలువ కట్టలపై కాలినడకన వెళుతున్నారని తెలిపారు. అదే ప్రాంతంలో జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇచ్చి ఉన్నారని, దారి లేకపోవడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

భవిష్యత్తు ప్రమాదాలు, రోడ్డుపై వెళ్లే వాహనాల వేగాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆయా పాఠశాలల వద్దనుండి ఫ్లైఓవర్‌ వద్ద ఉన్న సర్వీసు రోడ్డులో కలిసే విధంగా జాతీయ రహదారి వెంబడి మరో సర్వీసు రోడ్డు నిర్మాణం చేయడం ద్వారా భవిష్యత్తు ప్రమాదాలు నివారించగలరని కోరడంతో కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారి అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.