Home బాపట్ల అవిశ్వాసంపై రసవత్తర చర్చ

అవిశ్వాసంపై రసవత్తర చర్చ

159
0

– అవిశ్వాసం కోసం పట్టుబడుతున్న కౌన్సిలర్లు
– అవిశ్వాసం లక్ష్యం నెరవేరేనా?
– ఆశావహులపై శాసన సభ్యుని ఉద్దేశం ఏమిటి?
చీరాల (DN5 News) : మున్సిపల్‌ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం ప్రకటన అనంతరం వరుస పరిణామాలు హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. టిడిపికి మద్దతు ప్రకటించిన 14మంది కౌన్సిలర్లతోపాటు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ మద్దతుదారులుగా ఉన్న స్వతంత్ర కౌన్సిలర్లు ఐదుమందికితోడు అవిశ్వాసం తర్వాత ప్రకటించబోయే ఛైర్మన్‌ అభ్యర్ధి ఆధారంగా మరికొందరు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించి కలెక్టర్‌కు నోటీసు అందజేశారు.

నోటీసు ఇచ్చిన తర్వాత…!
కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. అప్పటి వరకు వైసిపి చైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, శాసన సభ్యులు ఎంఎం కొండయ్య సమక్షంలో టిడిపిలో చేరారు. ప్రస్తుతం టిడిపి ఛైర్మన్‌గా శాసన సభ్యునితో కలిసి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అవిశ్వాసం యధావిధిగా ఉంటుందన్న ఎంఎల్‌ఎ కొండయ్య
టిడిపికి మద్దతు ప్రకటించిన కౌన్సిలర్లూ అవిశ్వాసానికే పట్టుబడుతున్న విషయంపై ఆ పార్టీలో చర్చ నడుస్తుంది. దీంతో అవిశ్వాసం యధావిధిగా ఉంటుందని ఎంఎల్‌ఎ కొండయ్య ప్రకటించారు. అవిశ్వాసం పెడితే ఛైర్మన్‌ అభ్యర్ధి నుండి ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చన్న ఆలోచన పట్టుబడుతున్న కౌన్సిలర్లలో కనిపిస్తుందనే చర్చ బహిరంగంగా వినిపిస్తుంది. కౌన్సిలర్లు పెద్ద మొత్తంలో ఆశిస్తున్న నేపధ్యంలో ఆ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? అవిశ్వాసం కోరుతున్న కౌన్సిలర్లలో ఏకాభిప్రాయం సాధ్యమా? ఇలా అనేక సందేహాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

అభ్యంతరం పెడుతున్న వారి వాదనేంటి?
మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఒకే ఒక్క కౌన్సిలర్‌ టిడిపి సింబల్‌పై గెలిచారు. 21మంది ఫ్యాను సింబల్‌పై గెలిచిన వైసిపి కౌన్సిలర్లు, 11మంది స్వతంత్రంగా గెలిచిన ఆమంచి మద్దతు దారులు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొందరు 2024 సాధారణ ఎన్నికలకు ముందు, కొందరు తరువాత వైసిపి, స్వతంత్ర కౌన్సిలర్లు టిడిపికి మద్దతు ప్రకటించారు. ఛైర్మన్‌, అవిశ్వాసం కోరుతున్న టిడిపి మద్దతు దారులైన కౌన్సిలర్లు అందరూ వైసిపి నుండి, స్వతంత్రంగా గెలిచినవాళ్లే. ప్రస్తుతం వైసిపి ఛైర్మన్‌ కాస్త టిడిపికి మద్దతు ప్రకటించారు. అంటే ఎవరిని దించి ఎవరిని ఎక్కించాలన్నా… వైసిపి వాళ్లనే కదా ఛైర్మన్‌ను చేసేది. అవిశ్వాసం దేనికి, కొద్ది నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అలాంటప్పుడు ఈ వివాదం అంతా దేనికని తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు బహిరంగంగా వాదిస్తున్నారు. టిడిపిలో చేరిన ఛైర్మన్‌పై అవిశ్వాసం అంటే టిడిపిపై టిడిపి వాళ్లే అవిశ్వాసం నెగ్గించుకున్నట్లు అవుతుంది కదా? ఇలా ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తుండటంతో మున్సిపల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది.

బలరాం…. డాక్టర్‌ పాలేటి వైఖరిపైనా… చర్చ
వైసిపి ఛైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావు టిడిపిలో చేరిన నేపధ్యంలో మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అవిశ్వాసం విషయంలో ఎలా వ్యవహరించనున్నారు? గత మున్సిపల్‌ ఎన్నికల్లో వైసిపి కౌన్సిలర్‌ అభ్యర్ధుల ఎంపిక, విజయంలో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం టిడిపిలోనే ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు వైఖరి ఎలా ఉంటుందనేదీ చర్చనీయాంశం.

ఛైర్మన్‌ను దించితే… ఇంకెన్ని ట్విస్టులు చూడాలో…!
అవిశ్వాసం నోటీసు ఇచ్చిన తర్వాత వేగంగా మారిన మున్సిపల్‌ రాజకీయాలు అవిశ్వాసం కోరిన కౌన్సిలర్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఛైర్మన్‌ టిడిపిలో చేరికతో టిడిపి మద్దతు కౌన్సిలర్లను పరుగులు పెట్టించింది. అవిశ్వాసం యధావిధిగా ఉంటుందని ఎంఎల్‌ఎతో ప్రకటన చేయించే వరకు వెళ్లింది. మరి ఛైర్మన్‌ను దించి మరొకరిని ఛైర్మన్‌ను చేయాలంటే ఇంకెన్ని ట్విస్టులు చూడాలో..? గతంలో ఛైర్మన్‌ ఎన్నికల్లో టిడిపికి, వైస్‌ఛైర్మన్‌కు వైసిపికి మద్దతు ప్రకటించిన ఆమంచి కృష్ణమోహన్‌ మున్సిపల్‌ రాజకీయాల్లో అటు టిడిపి, ఇటు వైసిపి రెండింటిపై తన పట్టు నిలుపుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్‌ మద్దతు దారులైన కౌన్సిలర్లపైనే ఆధారపడి అవిశ్వాసానికి వెళుతున్న టిడిపికి మరోసారి అలాంటి అనుభవం ఎందువరదనే గ్యారెంటీ ఏమైనా ఉన్నదా? మున్సిపల్‌ రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్‌ పట్టుసాధిస్తే… శాసన సభ్యులు కొండయ్య రాజకీయ వైఖరి ఏమవుతుంది? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానం మే 14 వరకు వేచి చూడాల్సిందే…!