Home ఆంధ్రప్రదేశ్ బాబు పాఠం బాబుకే చెబుతున్న నేతలు

బాబు పాఠం బాబుకే చెబుతున్న నేతలు

323
0

– మధ్యలో వచ్చిన నేతలు మధ్యలోనే ముంచుతున్న వైనం
– కీలక సమయాల్లో బాబును వదిలి వెళుతున్న పదవులు కొన్న నేతలు
– అప్పుడు ఎంపీలు ఇప్పుడు ఎమ్మెల్సీలు
అమరావతి : తెలుగుదేశంలో కొందరు నేతలు బాబు పాఠాన్ని బాబుకే అడుగుతున్నారు. పదవులు కొన్న ఒక్కొక్క నేతలు ఒక సమయంలో బాబును వదిలి వెళుతున్నారు. టీడీపీ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీ పదవులు కొన్న నేతలు బాబు వెన్నుపోటు పాఠం బాబుకే చెబుతున్నట్లు అనిపిస్తుంది. కేంద్రంతో కీలకంగా వ్యవహరించాల్సిన సమయంలో రాజ్యసభ సభ్యులు, శాసనమండలిలో కీలకంగా వ్యవహరించాల్సిన సమయం లో ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి చంద్రబాబు కు వెన్నుపోటు పొడుస్తున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న నేతలను కాదని మధ్యలో వచ్చిన నేతలకు పదవులు ఇస్తే పదవులు పొందిన నేతలు ఇలా చేయడం పట్ల పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఒక వైపు వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ‘చంద్రబాబు’ను అసెంబ్లీలో కాకుల్లా పొడుచుకు తింటున్నారు. ఈ సమయంలో బాబుకు ఆసరా ఉండాల్సిన టిడిపి ప్రజాప్రతినిధులు.. తామూ ఒక పోటు పొడిచి వెళ్లిపోతున్నారు. కీలకమైన తరుణంలో పార్టీకి, ప్రజలకు అండగా ఉండాల్సిన టిడిపి ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం కాడిపడేసి.. స్వంత లాభాలు చూసుకుంటున్నారు. నిన్న అసెంబ్లీలో ‘రాజధాని’ తరలింపు విషయంపై అధికారపార్టీ మొత్తం ‘చంద్రబాబు’ను టార్గెట్‌ చేసి వ్యక్తిగత నిందలతో, దూషణలతో, ఆరోపణలతో, ఎద్దేవాలతో, ఎగతాళి చేస్తుంటే… అది చూసిన సామాన్య ప్రజలు ఈ వయస్సులో బాబుకు ఇదంత అవసరమా..? అన్న సానుభూతి చూపారు. ఆయన శత్రువులు కూడా.. నిన్నటి ఆయన పరిస్థితి చూసి.. అయ్యో పాపం.. అంటుంటే… ఆయన పార్టీకి చెందిన వారు మాత్రం తమ లాభాలను తాము చూసి ఆయనను ‘డొక్క’లో పొడిచివెళ్లిపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఆయన చుట్టూ, ఆయన కుమారుడి చుట్టూ… ప్రదిక్షణలు చేసిన ఈ నాయకమణులు.. కీలక సమయాల్లో తమ దారి తాము చూసుకుంటున్నారు.

‘డొక్కా’ను అందలం ఎక్కించిన ‘చంద్రబాబు’

రాష్ట్ర విభజన తరువాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ‘డొక్కా మాణిక్యవరప్రసాదరావు’కు ‘చంద్రబాబు’ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో సీనియర్ నేతలందరినీ కాదని ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అంతటి ప్రాధాన్యత పొందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడున్న క్లిష్టపరిస్థితుల్లో పార్టీని వేయటం చూస్తుంటే వెన్నుపోటు అంటే ఇదేనేమో అనిపిస్తోంది. 2014 ఎన్నికల తరువాత.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను పార్టీలోకి తీసుకుని అధికార ప్రతినిధి పదవిని ‘చంద్రబాబు’ ఇచ్చి గౌరవించారు. తరువాత ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. కాదని ‘డొక్కా’కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరింత ప్రోత్సహించారు. మొన్నటి ఎన్నికల్లో ‘పత్తిపాడు’ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు నాయకులు మొత్తుకున్నా.. ‘చంద్రబాబు’ పట్టించుకోకుండా… ‘డొక్కా’కు పదవి ఇచ్చారు. అలాంటి చంద్రబాబుకు అవసరమైన సమయంలో ‘డొక్కా’ చేసే పని ఇదా..? అంటూ సామాన్య కార్యకర్తలు, సానుభూతిపరులు నివ్వెరపోతున్నారు.

రాజధాని తరలింపుపై నిన్న అసెంబ్లీల్లో మూజువాణి ఓటుతో బిల్లు పాస్‌ చేసుకున్న వైసిపి ప్రభుత్వానికి శాసనమండలిలో ఇబ్బందులు ఎదురవుతాయని, టిడిపికి మెజార్టీ ఉన్న ఈ సభలో బిల్లు వీగిపోతే వైసిపి ప్రభుత్వానికి కొంచెమైనా దెబ్బ తగులుతుందని సామాన్య ప్రజలు, రాజధాని రైతులు భావించారు. ప్రభుత్వ బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగి ‘డొక్క’ రాజీనామా నిర్ణయం తీసుకోవడం సరైన చర్యేనా.. అని ప్రశ్నిస్తున్నారు. ‘రాజధాని’ తరలింపుకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేశానన్న ‘డొక్కా’ మాటలను ఏ విధంగా విశ్వసించ గళం. రాజధానిపై ప్రేమ ఉంటే మండలిలో పోరాడాలి కానీ… రాజీనామా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మండలిలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే ఆయన చిత్తశుద్ది ప్రజలకు అర్థం అయ్యేది. అలా కాకుండా ప్రలోభాలకు లొంగి రాజీనామాతో రైతులకు, అమరావతి ప్రజలకు ద్రోహం చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అయితే పార్టీలోని దిగువస్థాయి నేతలు మాత్రం ‘చంద్రబాబు’కు ఇలా కావాల్సిందేనని అంటున్నారు. పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో కాపాడిన నేతలను వదిలి అవతలి పార్టీ నుండి వచ్చిన వారికి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన బాబుకు పరిస్థితి జరగాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాబు ఎవరినైతే నమ్ముతారో.. వారే ఆయనను ‘డొక్క’లో పొడిచి పోతారని… మరోసారి రుజువైందని కొందరు టిడిపి నాయకులు బహిరంగంగానే మాట్లాడటం కనిపిస్తోంది.