బెంగళూరు : కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్-జేడీయూ కూటమి అభ్యర్ధులు జయకేతనం ఎగురవేశారు. కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు గత శనివారం ఉపఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మూడు చోట్ల విజయం సాధించి మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా కర్నాటకలో ప్రతిపక్ష బిజెపి కేవలం ఒక్క చోట మాత్రమే ముందంజలో ఉంది.
మాండ్య లోక్‌సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ తన సమీప బిజెపి అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. రామనగర్ అసెంబ్లీ నుండి జేడీఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలిచారు. జమఖండీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్ గెలిచారు.
బళ్లారి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి భారీ ఆధిక్యంలో ఉండగా. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్-బిజెపి మధ్య హోరాహోరీ ఉత్కంఠ పోటీ నెలకొంది. శివమొగ్గ పార్లమెంటు స్థానంలో బిజెపి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్పపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.