కొండాపురం (నెల్లూరు) : పేకాట శిభిరంపై దాడి చేసేందుకు వెళ్లిన నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్సై కె అంకమ్మ, మరో కానిస్టేబుల్ ఓ మహిళపై చేయి చేసుకున్నారు. దీంతో గ్రామస్థులు కొండాపురం పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. దళిత కాలనీలో పోలీసులు బీతావహ పరిస్థితి కల్పించారు. ఇళ్లలో ఉన్న యువకులను సైతం స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్దం కావడంతో మహిళలు అడ్డుకున్నారు. ఎందుకు తీసుకెళుతున్నారో చెప్పాలని పట్టుబట్టారు. మీ కేంటి చెప్పేదంటూ మహిళపై దురుసుగా ప్రవర్తించడంతో ఎస్ఐ తీరుపై గ్రామస్థులు ఆగ్రహించారు. గ్రామస్థుల ఆందోళన తెలుసుకున్న కావలి డిఎస్‌పి కె రఘు కొండాపురం వచ్చారు. కాలనీ వాసులతో చర్చించారు. ఆయన తెలుసుకున్న వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. ఉన్నతాధికారులు ఎస్ఐని, అతనితో ఉన్న కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులు దృవీకరించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.