Home జాతీయం వ‌ధువు ప్రేమికునితో ఎగిరిపోవ‌డంతో… నిశ్చేస్టుడిగా వరుడైన ఎంఎల్ఎ

వ‌ధువు ప్రేమికునితో ఎగిరిపోవ‌డంతో… నిశ్చేస్టుడిగా వరుడైన ఎంఎల్ఎ

1649
0

చెన్నై : అత‌నో ఎంఎల్ఎ. ఎక్క‌డో కాదు. ప‌క్క‌నున్న త‌మిళ‌నాడులో. అత‌ను వివాహం చేసుకునేందుకు నిశ్చితార్ధం చేసుకున్న వ‌ధువు వివాహ స‌మ‌యంలో ప్రేమికునితో రెక్క‌లు క‌ట్టుకుని ఎగిరిపోయింది. వ‌ధువు మ‌న‌సులో ఎవరున్నారో తెలుసుకోకుండా వివాహానికి ఒప్పుకుంటే ఎంత‌టి వారైనా త‌ల‌వంచుకోవాల్సిందే అనేదుకు ఇదో నిద‌ర్శ‌నం. చ‌దువుకునే చోట ప‌రిచ‌య‌మైన యువ‌కునితో ప్రేమ‌లో ఉంద‌ని తెలిసిన యువ‌తి త‌ల్లిదండ్రులు వివాహం చేస్తే స‌ర్ధుకుంటుంద‌ని బ‌ల‌వంతంగా పెళ్లికి ఒప్పించ‌డంతో ప‌రారై ఇటు త‌ల్లిదండ్రుల‌కు, అటు వియ్యపు వారికి ఇద్ద‌రికీ త‌ల‌వంపు త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌ల్పించింది. దీంతో ఆ ఎంఎల్ఎ పెళ్లి పెటాకులైంది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈరోడ్ జిల్లా భ‌వానీసాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అత‌నే 43ఏళ్ల‌ ఈశ్వ‌ర‌న్. అత‌నికి గోబిశెట్టిపాళ్యం స‌మీపంలోని ఉక్క‌రం ప్రాంతానికి చెందిన 23ఏళ్ల‌ సంధ్య‌తో వివాహం నిశ్చితార్ధం చేశారు.

వీరిద్ద‌రి వివాహం ఈ నెల 12న సత్యమంగళం సమీపంలోని బన్నారి అమ్మన్‌ ఆలయంలో జరగాల్సి వుంది. వ‌రుడు, వ‌ధువు త‌ర‌పు బంధువులు ఊరంతా పెళ్లి ప‌త్రిక‌లు పంచిపెట్టారు. వివాహ ఏర్పాట్లలో త‌ల‌మున‌క‌ల‌య్యారు. వీరిద్ద‌రి వివాహనికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ పన్నీర్‌సెల్వం, మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యేందుకు సిద్ద‌మ‌య్యారు. వ‌ధూవ‌రుల ఫోటోల‌తోపాటు అమ్మ జయలలిత ఫొటోతో ఘనంగా ముద్రించారు.

అయితే శనివారం ఉదయం 11 గంటలకు సంధ్య సత్యమంగళంలో ఉన్న తన సోదరిని చూసి సాయంత్రానికల్లా తిరిగి వస్తానని కుటుంబీకులకు చెప్పి వెళ్లింది. అయితే ఆమె తిరిగి సాయంత్రానికి ఇంటికి రాలేదు. వెంట‌నే సత్యమంగళంలో ఉన్న సంధ్య సోదరికి ఫోన్‌చేసి మాట్లాడారు. సంధ్యా త‌న‌వ‌ద్ద‌కు రాలేదని సోద‌రి తెలియడంతో ఇరు కుటుంబాల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. రెండు రోజులుగా ఆమె ఆచూకీ కోసం అన్ని చోట్లా వెదికారు. ఎక్క‌డా జాడ తెలియలేదు. దీనితో సంధ్య తల్లి తంగమణి కడత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదుపై పోలీసులు విచార‌ణ జ‌రిపారు. విచారణలో ఊత్తుకుళి ప్రాంతానికి చెందిన విగ్నేష్‌ అనే యువకుడు, సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నార‌ని తేలింది. ప్రేమ‌ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ స‌భ్యులు గుట్టు చప్పుడు కాకుండా అన్నాడీఎంకే శాసనసభ్యుడితో పెళ్లి కుదిర్చినట్లు తేలింది. తనకిష్టంలేని పెళ్లి చేస్తుండ‌టంతో సంధ్య తన ప్రేమికుడితో పారిపోయి ఉంటుందని అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్య ఆచూకీ కోసం వెదుకుతున్నారు.