Home జాతీయం ప్ర‌కృతి అందాల‌కు నెల‌వైన కేర‌ళ‌కు నూరేళ్ల‌లో ఎన్న‌డూ లేని క‌ష్టం వ‌చ్చింది

ప్ర‌కృతి అందాల‌కు నెల‌వైన కేర‌ళ‌కు నూరేళ్ల‌లో ఎన్న‌డూ లేని క‌ష్టం వ‌చ్చింది

642
0

– యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌
– నూరేళ్ల‌లో ఎన్న‌డూ లేనంతగా కేర‌ళ‌ను చుట్టుముట్టిన‌ వ‌ర‌ద‌
– ఇప్ప‌టికి 380మంది మృతి, ప్ర‌ధాని మోడీ ఏరియ‌ల్ ప‌రిశీల‌న‌
– త‌క్ష‌ణ సాయంగా రూ.500కోట్లు, పిఎం స‌హాయ నిధినుండీ హామీ
– తెలుగు రాష్ట్రాల‌తోపాటు అర‌బ్ ఎమిరేట్స్‌, విదేశాల్లోని భార‌తీయుల స్పంద‌న‌
– సినీతార‌లు, క్రీడాకారుల విత‌ర‌ణ‌

తిరువనంతపురం : కేర‌ళ‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఈపాటికే 380మందికి పైగా మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జాతీయ బ‌ద్ర‌తా సిబ్బంది (ఎన్డీఆర్‌ఎఫ్‌) సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రాన్ని ఆదుకోవ‌డానికి విరాళాలు అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖుల‌తోపాటు విదేశీయులు స్పందించారు. తాము చేయ‌గ‌లిగిన‌ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్ ప్రముఖ న‌టులు కేరళ వాసులకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంద‌రు ముందుకువచ్చి అక్కడ సహాయక చర్యలు చేప‌ట్టారు. కేరళ ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు యూఏఈ సమాయత్తమైంది. అంతేకాదు కేర‌ళ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న భారతీయులను కలుపుకొని ప్రత్యేక కమిటీని కూడా నియమించారు.

సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా కేర‌ళ‌ను ఆదుకునేందుకు సాయం చేయాల‌ని యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్టోమ్ ప్ర‌పంచానికి పిలుపునిచ్చారు. ‘ప్రకృతి అందాలకు నెలవైన కేరళకు కష్ట‌మొచ్చింది. మనమందరం కలిసి కేర‌ళ‌ను ఆదుకుందాం. మనకు చేతనైన స‌హాయం చేద్దాం. యూఏఈలో ఉండే భారతీయులతో కలిసి సాయం చేయబోతున్నాం. మీరు కూడా మాతో చేతులు కలపండి. అక్కడి వారందరికీ తక్షణ స‌హాయం అందించేందుకు ఓ కమిటీగా ఏర్పడ్డాం. వందేళ్లలో ఎన్న‌డూ లేనంతగా ఆరాష్ట్రాన్ని వరదలు చుట్టుముట్టాయి. ఈపాటికే వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. భారతీయ సోదరులను మ‌నంద‌రం ఆదుకుందాం రండి’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు.

కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రూ. 500కోట్ల సహాయనిధిని ప్రకటించారు. శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్‌ సర్వే చేశారు. అంతేకాదు వరద బాధితులకు పీఎం జాతీయ సహాయ నిధి నుండి నష్టపరిహారం కూడా ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన వాళ్ల‌ కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తామన్నారు.