Home జాతీయం క‌రుణానిధి అస్త‌మ‌యం

క‌రుణానిధి అస్త‌మ‌యం

466
0

చెన్నై: 50ఏళ్ల సుధీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణం చేసిన బాట‌సారి. ద్ర‌విడ జ‌న‌బాంధ‌వుడు, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌, కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముందని పార్టీ ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు.

50ఏళ్ల సుధీర్ఘ రాజ‌కీయ బాట‌సారి ప్ర‌స్థానంలో అద్బుత ఘ‌ట్టాలు
డీఎంకే అధినేతగా 50 ఏళ్లు కొనసాగారు. ఇంత సుధీర్ఘ ప్ర‌స్తానంలో ఆయన నాయకత్వంపై ఎలాంటి అసంతృప్తి లేకపోవడం ఆయ‌న‌కున్న ఆభ‌ర‌ణం. డీఎంకేను నెలకొల్పిన సమయంలో పార్టీకి అధ్యక్ష ప‌ద‌వి లేదు. సీఎన్‌ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ సీఎం అయ్యారు. సిఎంగా ఉన్న సమయంలోనే అన్నాదురై కన్నుమూశారు. ఆ త‌ర్వాత‌ పార్టీ బాధ్య‌త‌ల‌ను కరుణానిధి చేప‌ట్టారు. పార్టీ సాంప్ర‌దాయంగా ఉన్న కార్య‌ద‌ర్శి సాంప్ర‌దాయాన్ని కాద‌ని 1969లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఎవరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. పార్టీని ఏకతాటిపై నడిపించడంలో అనన్య ప్రతిభ ప్రదర్శించారు. కొన్నేళ్ల క్రితం పార్టీ నుంచి వై గోపాలస్వామి వెళ్లిపోయి ఎండీఎంకే అనే కొత్త రాజకీయపక్షాన్ని స్థాపించారు. ఆ ఒక్క సంఘటన తప్ప కరుణ నాయకత్వంపై ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కాకపోవడం విశేషం.


– 1969లో పార్టీ బాధ్యతలు తీసుకున్న అనంతరం 1971 శాస‌న స‌భ‌ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం
– అత్యవసర పరిస్థితి సమయంలోనూ అధ్యక్షుడిగా క‌రుణానిధి కొనసాగారు.
– 1980లో కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేశారు.
– 1989 లోక్‌సభ ఎన్నికల అనంతరం వీపీ సింగ్‌ ప్రధానిగా ఏర్ప‌డ్డ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో డీఎంకే నుండి మురసొలి మారన్‌కు మంత్రిత్వశాఖ సాధించి రాజ‌కీయాల్లో ఆయ‌న దూరదృష్టి ప్ర‌ద‌ర్శించారు.
– 1996లో కాంగ్రెస్ ‌నుంచి వేరుపడ్డ జికె మూప‌నార్ సార్ధ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు.
– 1999లో బిజెపితో ఎన్నికల పొత్తు, 2004లో కాంగ్రెస్‌తో పొత్తు, లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.
– 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరాటం చేశారు.
– 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన‌ప్ప‌టికీ సీట్లు పెంచుకున్నారు.