Home ఆంధ్రప్రదేశ్ మ‌డం తిప్ప‌ని నేత మ‌డ‌త నిర్ణ‌యంతో కార్య‌క‌ర్త‌ల్లో ఆందోళ‌న‌

మ‌డం తిప్ప‌ని నేత మ‌డ‌త నిర్ణ‌యంతో కార్య‌క‌ర్త‌ల్లో ఆందోళ‌న‌

542
0

– జగన్ నయవంచనకు స‌మిధ‌ల‌వుతున్న‌ ఆ అన్నదమ్ములు

-బాలినేని, వైవిల ఆదిప‌త్య పోరులో తారుమార‌వుతున్న నిర్ణ‌యాలు

అమ‌రావ‌తి : మాట త‌ప్ప‌డు. మ‌డం తిప్ప‌డు. విశ్వ‌స‌నీయ‌త‌కు మారుపేరైన వైసీపీ అధినేత జగన్ ప్ర‌కాశం జిల్లా చీరాల‌, కొడేపి నియోజక‌వ‌ర్గాల నేత‌ల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యాలు న‌మ్ముకున్న‌వారిని మ‌డ‌త‌పెట్టేలా క‌నిపిస్తున్నాయి. బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసిన డాక్ట‌ర్ వ‌రికూటి అమృత‌పాణి, కొండేపి వైసిపి నియోజ‌క‌వ‌ర్గ వైసిపి ఇన్‌ఛార్జి వ‌రికూటి అశోక్‌బాబు ప‌ట్ల జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుచూస్తే మాట తప్పడు… మడమ తిప్పడు… అన్న‌ జగన్ నినాదం చాలా బాగా అర్థం అవుతుంది. వీరిద్ద‌రి విష‌యంలో జ‌గ‌న్ తీరు చూస్తే “ఆడ‌వారి మాట‌ల‌కు అర్ధాలే వేరులే. అవునంటే కాద‌నిలే. కాదంటే అవున‌నిలే.“ అన్న పాట గుర్త‌కు వ‌స్తుంది. విశ్వసనీయత అంటే నయవంచన. మాట తప్పడు అంటే ఆడవారి వారి మాటలకు అర్ధాలే వేరులే అన్నతీరుగా ఉంది. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరికి సీటు ఇస్తానని చెప్పి మరొకరిని బరి నుంచి తప్పించాడు. ఇప్పుడు చివరకు ఆ ఒక్కరికి కూడా సీట్ లేకుండా చేసిన జగన్ విశ్వసనీయత గురించి తెలుసుకోవాల్సిందే. మాట‌త‌ప్ప‌ని, మ‌డం తిప్ప‌ని జగన్ మాటలు నమ్మి గ‌డిచిన‌ నాలుగేళ్లుగా పార్టీకోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు పోటీ చేసేందుకు సీట్ కూడా రాక ఒంటరిగా మిగిలిన ఆ సోదరుల గురించి తెలుసుకున్న మిత్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఇటీవల ప్రకాశం జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో పర్యటించిన జగన్ కొండేపి నియోజకవర్గానికి డాక్ట‌ర్ వ‌రికూటి అమృతపాణి సోదరుడు వరికూటి అశోక్ బాబుని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అశోక్ జగన్ మీద విశ్వాసంతో రవాణాశాఖలో అతున్నత ఉద్యోగాన్ని కూడా వదులుకుని వచ్చి పార్టీ కోసం కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో పని చేస్తున్నారు. ఆరుమండ‌లాలు, 143పంచాయితీల్లో క్యాడ‌ర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొడ‌పి సీటుకు అశోక్ పేరు బహిరంగంగా ప్రకటించిన జగన్… ఆ తర్వాత చీరాల వచ్చి డాక్ట‌ర్ వ‌రికూటి అమృతపాణికి ఒక విషయం చెప్పారు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరికి సీటు ఇవ్వగలం అశోక్ కి అక్కడ ఇచ్చాం కాబట్టి బాపట్ల పార్ల‌మెంట్ స్థానం మీద ఆశలు వదులుకోమన్నారు. అప్పటికే రూ.కోట్లు ఖర్చుపెట్టుకున్న అమృతపాణి తన సోదరుడికి సీట్ ఇచ్చారు కదా అని జగన్ చెప్పినట్లు విన్నారు. చీరాల నియోజ‌వ‌క‌ర్గంలో పార్టీని నిలుపుకునేందుకు త‌న‌దైన శైలిలో ప‌నిచేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న వివిధ ఘ‌ట‌న‌ల్లో అధికార పార్టీని ఎదుర్కొనే స‌మ‌ర్ధ‌త‌ను చూపుకున్నారు.

జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర జ‌రిగి నెలలు గడిచిన తర్వాత కానీ జగన్ తత్వం బ‌య‌టికి రాలేదు. జ‌గ‌న్ చేసిన వంచన ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క‌ర్త‌ల‌కు అర్ధ‌మైంది. ఇద్దతిలో ఒకరికి సీటు ఇస్తానని చెప్పి అమృతపాణిని సైలెంట్ చేసిన జగన్… అక్కడ అశోక్ స్థానంలో మరో వ్యక్తిని తెచ్చి పెట్టారు. చివరకు అశోక్ కి కూడా సీటు లేకుండా చేశారు. దాంతో అశోక్ వర్గీయులు ఆందోళనకు దిగారు. అయితేనేమి వైసీపీలో జగన్ మాటే వేదం కదా. ఆయన నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ కదా. దాంతో వరికూటి సోదరుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. డబ్బు పోయి… సీట్ రాక రెండు విధాలా దెబ్బ తిన్నారు. ఈ సోద‌రులిద్ద‌రిప‌ట్ల జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం చీరాల‌, సంత‌నూత‌ల‌పాడు, కొండ‌పి, ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.

పోతుల రామారావు, జూపూడి ప్ర‌భాక‌ర్‌తో స‌న్నిహితంగా ఉంటున్న కొండేపి నియోజ‌క‌వ‌ర్గంలోని క్రిందిస్థాయి వాళ్లు కొంద‌రు ఒంగోలు తాజామాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని త‌ప్పుదోవ ప‌ట్టించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌ధ్యంలో పార్టీ జిల్లా అధ్య‌క్షునిగా ఉన్న బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి వ‌ర్గీయుల‌కు, వైవి సుబ్బారెడ్డి వ‌ర్గీయుల‌కు జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ఖ్య‌త కుద‌ర‌డంలేదు. ఆ కార‌ణంగా బాలినేని వ‌ర్గీయులుగా ఉన్న‌వారిపై వేటు ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక తాజాగా కాంగ్రెస్ నేత మహిధర్ రెడ్డి రాకతో కందుకూరులోనూ అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న తూమాటి మాధవరావును పార్టీ అభ్యర్థిగా జగనే స్వయంగా తన పాదయాత్ర సందర్భంగా బహిరంగంగా ప్రకటించారు. ని పని నువ్వు చేసుకో అని మాధ‌వ‌రావును భుజం తట్టారు. అయితే ఇప్పుడు మహిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించడంతో మాధవ్ పరిస్థితి అగమ్యగోచర‌మైంది. దీనికి ముందు పర్చూరు నియోజకవర్గంలో కూడా జగన్ ఇదే విశ్వసనీయత చూపించారు. ఇక్కడ గొట్టిపాటి భరత్ కు చేయిచ్చి రావి రామ‌నాధంబాబును తీసుకొచ్చి పెట్టారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జీల పేర్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్ చీరాల ప‌ర్య‌ట‌న‌లో చీరాల ఇన్‌ఛార్జిగా ఉన్న య‌డం బాలాజీ పేరు ప్ర‌క‌టించ‌కుండా సంద‌గ్దంలో పెట్టారు. మొత్తంమీద జగన్ ఇస్తున్న షాకులతో ప్రకాశం జిల్లా వైసిపి కేడర్‌లో ఆందోళ‌న మొద‌లైంది. ఇప్పుడెవ‌రిపేర్లు ప్ర‌క‌టించినా రేపు నామినేష‌న్ వేసే నాటికి సీల్డు క‌వ‌ర్ ఎవ‌రి చేతికొస్తుంద‌నే భ‌యం అభ్య‌ర్ధుల‌ను వెంటాడుతుంది.