Home ఆంధ్రప్రదేశ్ కన్నీళ్లు పెట్టిన మోత్కుపల్లి…

కన్నీళ్లు పెట్టిన మోత్కుపల్లి…

576
0

అమరావతి : మోడీ మాట మీద నిలబడి ఉంటే గవర్నర్ కావాల్సిన వ్యక్తి అయిన మోత్కుపల్లి నరసింహులు. ఇప్పుడు ఆయన వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశమైనది. తెలంగాణ మహానాడు తర్వాత మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో మోత్కుపల్లి కీలుబొమ్మగా మారారని టీ.టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా ఆరోపించారు. టీడీపీ, చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత మోత్కుపల్లికి లేదన్నారు. గవర్నర్‌ పదవి కోసం బీజేపీ నేతల దగ్గరకు తీసుకెళ్లి మాట్లాదించింది చంద్రబాబు కదా అని ప్రశ్నించారు. గవర్నర్‌ పదవి.. బీజేపీ ఇవ్వకపోతే చంద్రబాబు ఏం చేస్తారని అన్నారు.

పవన్‌, జగన్‌ను పొగుడుతున్న మోత్కుపల్లిని ఎవరు ఆడిస్తున్నారో తెలుసని సండ్ర పేర్కొన్నారు. మహానాడు సమయంలో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని… మోత్కుపల్లి రాజకీయ జీవితం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లిని మహానాడుకు ఎలా పిలుస్తామని ఎమ్మెల్యే సండ్ర ప్రశ్నించారు.

మరోవైపు మోత్కుపల్లి మళ్ళీ రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో మోత్కుపల్లి నివాళులర్పిస్తూ… తనపై కుట్రలు పన్ని తెలుగుదేశానికి దూరం చేశారంటూ మోత్కుపల్లి బోరుమని విలిపించారు. చంద్రబాబు మాట మీద నిలబడటం లేదని ఆరోపించారు. తమతో ఉంటానని చెప్పి.. గద్దెనెక్కగానే తమని మరిచిపోయారని మండిపడ్డారు. తెలంగాణవాదులు దాడులు చేస్తుంటే తానే కాపాడానని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకు నైతిక విలువలు లేవని విమర్శించారు. రాజ్యసభ సీట్లను కోటీశ్వరులకు అమ్ముకున్నారని చంద్రబాబుపై ఆరోపించారు. టీడీపీని నందమూరి వారసులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలో.. ప్యాకేజీ కావాలో నాలుగేళ్లుగా చంద్రబాబు తేల్చుకోలేకపోయారన్నారు. నోట్ల రద్దును సమర్ధించి… ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బు లేదంటున్నారని చంద్రబాబు నుద్దేశించి అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు సలహా ఇచ్చింది చంద్రబాబు కాదా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను బట్టి టీడీపీలో ఆయన శకం ముగిసినట్లే అని తేలిపోయింది. మనసులో ఏదో కుట్ర పెట్టుకుని ఇతర పార్టీల అండతో ఆయన ఈ వ్యాఖ్యలన్ని చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.