Home జాతీయం కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఎవరెవరు హాజరయ్యారో తెలుసా…?

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఎవరెవరు హాజరయ్యారో తెలుసా…?

509
0

బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ‌విధాన సౌధ తూర్పుద్వారం మెట్ల వద్ద ఏర్పాటు చేసిన భారీ వేదికపై గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం సభకు భారీసంఖ్యలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు, ప్రజలు హాజరవడంతో అట్టహాసంగా జరిగింది.

కుమారస్వామి ప్రభుత్వం బలనిరూపణ చేసుకున్న అనంతరం మిగతా మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒప్పందం ప్రకారం మంత్రి పదవులు పంచుకున్నారు. కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. స్పీకర్‌ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించగా.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని జేడీఎస్‌కు ఇచ్చారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడువేల మందికిపైగా వీఐపీలు  ప్రత్యేక  అతిథులుగా విచ్చేశారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వి యాదవ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి వంటి హేమాహేమీలు హాజరయ్యారు.

రెండోసారీ సంకీర్ణ ప్రభుత్వానికే సారధ్యం
కుమారస్వామి ఇది రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడూ సంకీర్ణ ప్రభుత్వమే. తొలిసారి 2006లో బిజెపితో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వానికి 20నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికార బదిలీకి ఆ పార్టీతో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో 2007 నవంబరు 2న బిజెపి మద్దతు కోల్పోవడంతో సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కొలువుదీరిన కాంగ్రెసుతో చెలిమి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడాల్సిందే.