చీరాల : ఆత్మ హత్య చేసుకునే హక్కు కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన కేసు విచారించిన ధర్మాసనం సచలన తీర్పు ఇటీవలే వెలువరించింది. ఆత్మహత్య చేసుకోవడం గతంలో నేరం. ఎవ్వరికీ బలవంతంగా చనిపోయే హక్కులేదు. శిక్షార్హులౌతారు. ఈ అంశంపై కొందరు సుఫ్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధలు భరించలేని స్తితి ఉంది. ఎప్పుడైనా చనిపోయేవారమే. అలాంటప్పుడు ఈ బాధలు ఎందుకు భరించాలి. అలాంటి బాధల నుండి విముక్తి పొందేందుకు అవకాశం కల్పించాలని కోర్టులో చేసిన వాదనలపై సుఫ్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. బలవంతంగా చనిపోవాలనుకునే వాళ్లు నిర్ధిష్టమైన అనారోగ్య కారణం చూపి పోలీసుల అనుమతికి ధరకాస్తు చేసుకోవాలని సూచించింది. అలా అనుమతి తీసుకుని చనిపోతే ఎలాంటి కేసు, అభ్యంతరాలు ఉండవని తీర్పులో వెలువరించింది.
సుఫ్రీం కోర్టు తీర్పు తెలుసుకున్నాడేమో. అదే తరహాలో ప్రకాశం జిల్లా చీరాలలో పిల్లలు పుట్టలేదన్న కారణంతో దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయే ముందు ఇద్దరూ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ముందురోజే తమపేర్లతో స్టాంపు పేపర్లు కొనుక్కున్నారు. స్టాంపు పేపర్లలో ఇలా ఇద్దరు కలిసి రాశారు.
“చీరాల సర్కిల్ ఇన్సపెక్టరు గారికి, అయ్యా..! నా పేరు పాలువాది శ్రీనివాసమూర్తి మరియు నా భార్యపేరు పాలువాది నాగమణి. ఇద్దరము వ్రాయునది ఏమనగా మాకు ఎటువంటి సంతానము లేరు. ఎటువంటి అనారోగ్యాలు లేవు. మాకు ఎటువంటి అప్పులు లేవు. మాకు రావాల్సిన బాకీలు లేవు. ఇప్పటి వరకు చాలా సంతోషముగానే ఉన్నాము. ఇప్పటికి మా వయస్సు 45సంవత్సరాలు. ఇక నుండే కదా ఎక్కువ అనారోగ్యాలు వచ్చేవి. అందుకని మమ్మల్ని చూసుకొనుటకు ఎటువంటి సంతానము లేదు. కనుక ఆ దిగులుతో బాధలో శాశ్వతముగా ఈ లోకము నుండి పోవుటకు నిర్ణయించుకున్నాము. దీనిలో ఎవరికినీ ఎటువంటి ప్రమేయము లేదు. ఇవి మా భార్య భర్తలు తీసుకున్న స్వంత నిర్ణయము. మమ్మలను క్షమించగలరు. ఇట్లు తమ విధేయుడు, విధేయురాలు పి శ్రీనివాసమూర్తి, పి నాగమణి.“ అంటూ మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సంచలనం రేపింది. వీరి ఆత్మహత్య విషయం తెలుసుకున్న చీరాల ఒకటో పట్టణ సిఐ వి సూర్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.