పర్చూరు : రాజధాని అమరావతి పనులకు శ్రీకారం చుట్టాం. నాలుగేళ్లలో అమరావతికి పూర్వ వైభవం తెస్తాం. ఏపీ జీవనాడి పోలవరం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా అన్నక్యాంటీన్లు పెట్టి పేదలకు భోజనం పెడుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు మంజూరు చేసింది. విశాఖకు రైల్వే జోన్ వస్తోంది. గత ఐదేళ్లు రోడ్లు ఎలా ఉన్నాయో చూశారు. ఆ గుంతల రోడ్లలో ఆస్పత్రికి వెళ్తూ దారి మధ్యలోనే గర్భిణీ డెలివరీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే రోడ్ల మరమ్మతులు చేపట్టాం. భవిష్యత్ లో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయి. ఈ నెలలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లోగా కొత్త టీచరు పోస్టులు భర్తీ చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ మే నెలలో తల్లికి వందనం ఇస్తాం. దీపం2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్లు ఏడాదికి 3 ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే రు. 6వేలతో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు వేస్తాం. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఈనెలలోనే మత్స్యకారులకు రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తాం. నేను తెచ్చిన డ్వాక్రా సంఘాలు నేడు ఒక వ్యవస్థగా మారినందుకు ఎంతో గర్వంగా ఉంది.