Home బాపట్ల యంగ్ సైంటిస్ట్ ఇండియా సైన్సు మాస పత్రిక ఆవిష్కరణ

యంగ్ సైంటిస్ట్ ఇండియా సైన్సు మాస పత్రిక ఆవిష్కరణ

107
0

చీరాల : గీతా సంస్థ దేశ వ్యాప్తంగా హైస్కూలు విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుందని సంస్థ ఛైర్మన్‌ వలివేటి మురళి కృష్ణ తెలిపారు. 22 రాష్ట్రాల నుండి 65వేల మంది విద్యార్థులు పాల్గొంటున్న ఈ ప్రోగ్రామ్ 2022 జనవరి 26న ప్రారంభించినట్లు తెలిపారు. ఆవిష్కార్ అవార్డుల ద్వారా ఇప్పటికే 25 ఆవిష్కరణలు రాబట్టినట్లు తెలిపారు. మూడేళ్లు పూర్తయిన సందర్భంగా యంగ్ సైంటిస్ట్ ఇండియా అనే ఒక సైన్సు మాస పత్రికను చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాల కొండయ్య ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ కొండయ్య మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, నూతన ఆవిష్కరణల వైపు ఆలోచింపజేసే విజ్ఞాన సమాచార మాస పత్రిక చీరాల నుండి ప్రచురించడం ఎంతో అభినందనీయం అన్నారు.

రైలు ప్రయాణీకులు బండి కదిలేటప్పుడు ప్రమాదాలకు గురవకుండా 10వ తరగతి విద్యార్ధులు అక్షయ, సుప్రియ సూచించిన సిగ్నల్ విధానం చాలా ఉపయోగకరం అన్నారు. మధ్యప్రదేశ్ విద్యార్థి ఆరుష్ తయారు చేసిన అగ్నినిరోధక పదార్థం ఎంతో ఆలోచనాత్మకంగా ఉన్నదన్నారు. స్కూలు విద్యార్డులైన వారిలో ఎంతో ప్రతిభ దాగుంటుందని అన్నారు. దాన్ని వెలికి తీయడానికి యంగ్ సైంటిస్ట్ ఇండియా మాస పత్రిక జాతీయ స్థాయిలో దోహద పడుతుందని మెచ్చుకున్నారు.

గీతా సంస్థ ఛైర్మన్ వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా ఒక మంచి కార్యక్రమం అంటూ ప్రోత్సహించి పత్రిక ఆవిష్కరించిన ఎంఎల్‌ఎ కొండయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ నెలా విద్యార్థుల సృజనాత్మకతకు దోహదపడే వ్యాసాలు, భారత శాస్త్రవేత్తలు, భారతీయ ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన శిక్షణ అంశాలు, మెలుకువలు ఈ పత్రికలో ఉంటాయని అన్నారు.

ఈ మొదటి సంచికలో మేధోమథనం brainstorming)ద్వారా సమస్యలు, పరిష్కారాలు గుర్తించే విధానం సమగ్రంగా ఉందన్నారు. ఏ సమస్యనైనా క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఎందుకు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎవరు? ఎలా? అనే ఆరు ప్రశ్నల మెలుకువలను నేర్పుతున్నట్లు తెలిపారు. ఈ పత్రిక విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ఈ పత్రిక గీతా డిజిటల్ మాధ్యమాల్లో, YoungScientistIndia.org అనే వెబ్‌సైట్లో అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 99667 75534 నంబరుకు ఫోనుచేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో పత్రిక సంపాదకులు నందమూడి కృపా కిరణ్, చీమకుర్తి మధుసూదనరావు పాల్గొన్నారు.