బాపట్ల : మండలంలోని ఆసోదివారిపాలెం పంచాయతీ మరుప్రోలువారిపాలెం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 365/1లో ఉన్న 27 సెంట్ల భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించి తనకు స్వాధీనం చేయాలని గత కొద్ది రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పట్ల గుంటూరులో నివాసం ఉంటున్న చంద్రపాటి శివ నాగభూషణరావు ఆవేదన వ్యక్తం చేశారు.
69ఏళ్ల వయసులో రెండు కాళ్లు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్న తన భూమిని తనకు ఇప్పించాలని కోరుతూ మంత్రి నారా లోకేష్, బాపట్ల ఎస్పీని కలిసినప్పటికీ రెవిన్యూ అధికారులు పెడచెవిన పెట్టడుతున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో తన బాధ చెప్పుకునేందుకు వెళ్లిన సమయంలో మంత్రి లోకేష్ నేరుగా తన వద్దకే వచ్చి తన సమస్య విని పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా అధికారులకు తన అర్జీని సిఫార్సు చేసినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
అంతే కాకుండా ఆక్రమణదారులకు సహకరిస్తూ తన భూమిని తనకు కొలిచి ఇవ్వడం లేదని, భూమి హద్దులు అడిగితే ఎక్కడ కొలవాలో చెబితే కొలుస్తామని నడవలేని స్థితిలో ఉన్న తనను హద్దులు చూపమని రెవిన్యూ సిబ్బంది అడగడం ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. భూమిని స్వాధీనం చేయమంటే ఆక్రమణదారులు ఇచ్చిన డబ్బు తీసుకొని భూమి వదులుకోమని సలహాలు ఇవ్వడం, భూమిని చూపించమని అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి తనను తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్వీకుల ద్వారా తమకు సంక్రమించిన సంపూర్ణ హక్కులు కలిగిన తన భూమిని గత ఐదేళ్లుగా కౌలు వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తులు తనకు కౌలు చెల్లించకపోగా, తప్పుడు పత్రాలు సృష్టించుకుని తన భూమిని కాజీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో నివాసం ఉంటున్న తాను తన స్థలం తనకు చూపించాలని కోరేందుకు బాపట్ల వచ్చిన సమయంలో నడవలేని స్థితిలో ఉన్న తనను భయపెట్టి భూమి స్వాధీనం చేసుకునేందుకు ఆక్రమణదారులు తన కారుపై దాడికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఆక్రమణదారుల నుండి విడిపించి తన భూమిని తనకు అప్పగించాలని కోరారు.