కారంచేడు : తెలుగుదేశం (Telugudesham) సీనియర్ నేత, మాజీ ఎంపిపి, ఎఎంసి మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి అంతిమ యాత్ర అశ్రునయనాల మధ్య సోమవారం నిర్వహించారు. కారంచేడు (Karamchedu) గ్రామంలోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తొలుత తెలుగుదేశం నాయకులు, బంధువులు ఆయన పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం అభివృద్ధికి అక్కయ్య చౌదరి కృషిని కొనియాడారు. తెలుగుదేశం నేతగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రజలకు, రైతులకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో కష్టపడి పనిచేసి అనేక పదవులు అధిరోహించారని పలువురు పేర్కొన్నారు. శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు అక్కయ్య చౌదరి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్కయ్య చౌదరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు వెంకటకృష్ణను ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.