తిరువనంతపురం : దేశంలోనే అతి పిన్న వయస్సు కలిగిన మేయర్ మరో సారి దేశం దృష్టిని ఆకర్షించారు. (Tiruvananthapuram) తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ తన నెల రోజుల పాపతో కార్యాలయంలో పనిచేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాపని లాలిస్తూ ఫైళ్లను సమీక్షిస్తున్న చిత్రం నెటిజనులను ఆకట్టుకుంటోంది. వృత్తిపరమైన, వ్యక్తిగత బాధ్యతలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె గడుపుతున్న జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు వస్తున్నాయి.
మహిళల ఆశయాలకు మాతృత్వం ఆటంకం కాదనే ఆలోచనకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆమె నిలిచిందని అంటున్నారు. మరి కొందరైతే మిశ్రమంగా స్పందించారు. కూలీలు తమ పిల్లలను నడుముకు కట్టుకుని బరువులు ఎత్తుకున్నప్పుడు కలిగే బాధ వర్ణనాతీతమని, మాతృత్వానికి ఏదీ అడ్డు కాదని అంటున్నారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21సంవత్సరాల వయస్సులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో దేశంలోనే అతి పిన్న వయస్సులో (Mayor) మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆమె కేరళ ఎమ్మెల్యే సచిన్ దేవ్ (MLA)ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆగస్టు 10న ఆడబిడ్డ జన్మించింది.