అమరావతి : 1998లో నిర్వహించిన డీఎస్సీలో కృష్ణా జిల్లా నుంచి 14వందల పోస్టులకు గాను 8వందల మంది అర్హత సాధించారు. కానీ అంతకు ముందు నిర్వహించిన డీఎస్సీకి సంబంధించిన క్యారీ ఫార్వార్డ్ ఖాళీలను పూరించి 1998లో అర్హత పొందిన వారికి మొండి చేయి చూపించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి. అధికారులు మారారు. చూస్తుండగానే 22ఏళ్లు గడిచిపోయాయి.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తొలిసారిగా 1998డీఎస్సీకి అర్హత పొందిన వారి సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీ వేశారు. అయినా ఫలితం లేదు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2018లో గత ప్రభుత్వం హయాంలో మరో కమిటీ వేశారు. ఇది 1998 డీఎస్సీ అర్హులతోపాటు 2008డీఎస్సీ అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు 1998డీఎస్సీ వారికి మళ్లీమొండి చెయ్యే చూపించారు.
అర్హత సాధించి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే 22 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రైవేటు ఉద్యోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే పలువురు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
1998డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా అసలు విషయం పక్కదారి పట్టి వీరి తర్వాత (డీఎస్సీ-2008లో) ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పూనుకోవడం తమకు అన్యాయం చేయడమేనని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఏపీయుఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శ్రావణ్ కుమార్, పి రవిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.