Home జాతీయం జులై నుండి 13 అంకెల మొబైల్‌ నంబర్లు

జులై నుండి 13 అంకెల మొబైల్‌ నంబర్లు

410
0

డిల్లీ : ఫోన్‌ నంబర్ల విషయంలో మరింత భద్రతను పెంచేందుకు అధికారులు సిద్ద‌మ‌య్యారు. 13 అంకెల‌తో మొబైల్‌ నంబర్‌ తీసుకొచ్చే యోచనలో టెలికాం సంస్థ‌లు ఉన్నట్లు సమాచారం. త్వరలో కస్టమర్లకు 13 అంకెలతో మొబైల్‌ నంబర్లను మంజూరు చేయాలని టెలికమ్యూనికేషన్‌ విభాగం దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లకు మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత‌మున్న‌ మొబైల్‌ నంబర్లు కూడా 13అంకెల నంబర్‌కు మార్చే అవ‌కాశం ఉంది. 2018 అక్టోబరు 1 నుండి 2018 డిసెంబరు 31లోగా ప్రస్తుతమున్న మొబైల్‌ నంబర్లను 13అంకెలకు మార్చాలని సూచించినట్లు స‌మాచారం.

కేంద్ర టెలికమ్యూనికేషన్‌ విభాగం నుండి ఈ ఏడాది జనవరి 8న మార్గదర్శకాలు వచ్చాయని బిఎస్ఎన్ఎల్ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ఈ అంశంపై పనిచేయడం ప్రారంభించామని తెలిపారు. 13అంకెల నంబర్లను జారీ చేసే విధానాన్ని జులై 1వ తేదీ నుండి మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. జులై 1వ తేదీ నుంచి ఇక 13అంకెల మొబైల్‌ నంబర్లే ఇస్తార‌న్నారు. ప్రస్తుతం ఉన్న 10 అంకెల మొబైల్‌ నంబర్లు అక్టోబరు 1వ తేదీ నుండి 13అంకెల‌కు మార్చడం ప్రారంభిస్తామని వెల్లడించారు. మరో టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. టెలికాం డిపార్ట్‌మెంట్‌ 13అంకెల నంబర్‌ విధానాన్ని ఆమోదించిందని ట్రాయ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. సమాచార మంత్రిత్వ శాఖ కూడా ట్రాయ్‌కు రాసిన లేఖలో సిమ్‌తో నడిచే మెషీన్‌ టు మెషీన్‌ పరికరాలకు 13అంకెల నంబరు విధానాన్ని ఆమోదించినట్లు స‌మాచారం.