చీరాల : మండలంలోని వాడరేవు, ఇతర సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో రు.15లక్షల విలువైన ఒక ట్రాక్టర్, ఒక్కొక్క టాంకర్ పదివేల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు నీటి ట్యాంకర్లను స్వామి రామానంద సరస్వతి చేతుల మీదుగా శాసన సభ్యులు మద్దులూరి మాల కొండయ్యకు అందజేశారు. తొలుత ఆశ్రమం ఆవరణలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టాంకర్లకు సంబంధించిన ట్రాక్టర్ తాళాలను శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యకు స్వామి రామానంద సరస్వతి అందజేశారు. తాగునీటిని నింపిన టాంకర్ల ద్వారా వాడరేవు గ్రామంలో ప్రజలకు నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాలకొండయ్య మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చేందుకు స్వామి వారి సహకారం అభినందనీయమని అన్నారు. గతంలోనూ సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకుల రక్షణ కోసం బీచ్ బైకులు, వాచ్ టవర్ల ఏర్పాటుకు స్వామివారు చేసిన సహకారాన్ని గుర్తు చేశారు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో వాడరేవు పంచాయితీ అధికారులు, ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు..