Home ప్రకాశం నేరస్తులకు అండగా మోడీ ప్రభుత్వం – వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు

నేరస్తులకు అండగా మోడీ ప్రభుత్వం – వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు

224
0

టంగుటూరు (దమ్ము) : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బిజెపి ఎంపీ బ్రీజ్ భూషణ్ చరణ్ సింగ్ ను, హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ ను అరెస్టు చేయాలని గత 26రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన దీక్షలకు మద్దతుగా కొండేపిలోని గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, CITU సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ దేశానికి స్వర్ణ పతకాలు సాధించిపెట్టిన మహిళా క్రీడాకారులు తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బజారున పడాల్సిన దుస్థితినీ పాలకులు కల్పించారని అన్నారు. ప్రపంచ దేశాలలో భారత క్రీడా ప్రతిష్టను ఇనుముడింపజేస్తున్న అగ్రశ్రేణి రెజ్లింగ్ క్రీడాకారులు సాక్షి మాలిక్, వినేష్ పొఘాట్, బజరంగ్ పూనియా తదితర క్రీడాకారులు ఈ ఉద్యమాన్ని సాగిస్తున్నారని తెలిపారు. క్రీడా పోటీలకు ఎంపిక కావాలంటే తాము కోరినవన్నీ చేయాలని, లైంగిక వేధింపులకు, దాడులకు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్, మరి కొంతమంది పాల్పడుతున్నారని ప్రభుత్వ అధికారులకు, క్రీడామంత్రికి గత జనవరి నెలలో తెలియ చెప్పడం జరిగిందన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెబుతూనే అధికార యంత్రాంగం అంతా దోషులకు మద్దతుగా వ్యవహరించటం, బెదిరింపులకు పాల్పడటం జరిగిందని అన్నారు. తమ మీద లైంగిక వేధింపులు జరిగాయని విధిలేని పరిస్థితుల్లోనే, సిగ్గు విడిచి మహిళా క్రీడాకారులు నిరసన ఉద్యమంలోకి రావాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని తెలిపారు.

బ్రిజ్ భూషణ్ శరన్సింగ్ 41 క్రిమినల్ కేసుల్లో ఉన్నాడని, అతనితో పెట్టుకుంటే అంతు చూస్తాడని, ఉద్యమాన్ని విరమించుకొని ఇంటికి పోండని పాలకులు మాట్లాడటం సిగ్గుచేటనీ ఆయన అన్నారు. అనేక అవమానాలను, ఆటంకాలను అధిగమించి, ఆడబిడ్డలు అనేక ఉద్యమాలు సాగిస్తున్నారని, దాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు అణగదొక్కే చర్యలకు పాల్పడటం, అనాగరికమైన మనువాద భావజాలాన్ని నెత్తికెత్తుకోవడం విచారకరమనీ అన్నారు. దేశ క్రీడా కీర్తి పతాకాలు ప్రపంచ దేశాల్లో వెలుగెత్తి చాటుతున్న మహిళా క్రీడాకారులు, స్వర్ణ పథక విజేతలు బజారున పడి గత 26 రోజులుగా నిరసన ఉద్యమం చేస్తుంటే కళ్ళుండి చూడలేని కబోదిలా మోడీ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కెజి మస్తాన్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అనాగరిక పాలన సాగిస్తున్నదని విమర్శించారు. ఈ రెజ్లర్ల ఆందోళన విషయంలోనే కాదని, బిజెపి పాలకులు మహిళల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు పట్ల అనాగరికంగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్ లోని వున్నావ్ గ్రామంలో తన ఇంటిలోనే పనిచేస్తున్న మహిళలపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడితే ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా బిజెపి నేతలు వ్యవహరించారని అన్నారు. హత్రాస్ లో ఒక దళిత యువతిని అత్యాచారం చేసి అమానుషంగా హత్య చేసిన దోషులకు మద్దతుగా బిజెపి నేతలు వ్యవహరించారని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని ఒక దేవాలయంలో వారం రోజులపాటు ఒక బాలికపై పూజారి అత్యాచారం చేసిన ఘటనలో దోషిని పోలీసులు అరెస్టు చేస్తే దోషికి అనుకూలంగా బిజెపి నేతలు ప్రదర్శన నిర్వహించారని అన్నారు. ఇటీవల గుజరాత్ లోని బిల్కీస్ భాను పై 11 మంది అత్యాచారం చేసినటువంటి దోషులను జైలు నుంచి విడుదల చేసి దోషులకు దండలు వేసి స్వాగత సత్కారాలు చేసి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. ఇలాంటివి ఒకటి కాదని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అన్నిటికి బిజెపి నేతలు మద్దతిస్తున్నారని అందుకే ఇటువంటి అకృత్యాలు సమాజంలో పెరిగిపోతున్నాయని అన్నారు.

ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఉద్యమానికి క్రీడాకారులు, క్రీడాభిమానులు, యావత్తు ప్రజానీకం సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెజ్లర్ల కు మద్దతుగా సంతకాలు సేకరించి రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంగల కుర్తి బ్రంహయ్య, CITU నాయకులు జి.వందనం, రైతు సంఘం నాయకులు ముప్ప రాజు బ్రంహయ్య, మల్లెల కొండయ్య , యం. చిన్న పేతురు, సి.హెచ్.సునంద, కె. బసవయ్య పాల్గొన్నారు.