ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్ అని వైసిపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటారు. అయితే ముఖ్యమంత్రికి అంత సీన్ లేదంటే తెల్చేశారు ఈ యువనేత. ఆయన రేంజ్ ఓ పిల్ల కాలువ సైజ్ మాత్రమేనని తేల్చి చెప్పేశారాయన. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ జనంలోకి దూసుకెళ్తూ ప్రజలతో నీరాజనం పట్టించుకుంటున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… వైసిపీ ప్రభుత్వం పైనా.. జగన్ పాలనపైన సూటి విమర్శలను సంధిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో లోకేష్ జగన్ పాలనా తీరును తనదైన శైలిలో ఊరమాస్ పంచులతో తూర్పారబట్టారు. జగన్‌ది పిల్ల కాలువ రేంజ్ అయితే.. చంద్రబాబుది పోలవరం రేంజ్ అని లోకేశ్ ఏద్దేవా చేసారు. పిల్లకాలువ కూడా తవ్వలేని జగన్ పోలవరం పూర్తిచేస్తాడా…? అని సూటిగా నీలాదీశారు. చంద్రబాబు పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి 72శాతం పనులు పూర్తిచేశారని గుర్తుచేశారు. జగన్ కమీషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులనే రివర్స్ చేసి పారేశారన్నారు. డయాఫ్రమ్‌వాల్ దెబ్బతినడానికి, గైడ్‌బండ్ కుంగిపోవడానికి జగన్ కక్కుర్తే కారణమని లోకేష్ మండిపడ్డారు. సీఎం జగన్ వద్ద ఎప్పుడూ రెండు బటన్లు ఉంటాయని లోకేశ్ తెలిపారు. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్‌లో పది రూపాయలు పడతాయని రెడ్ బటన్ నొక్కగానే మీకు తెలియకుండానే మీ అకౌంట్ నుంచి వంద రూపాయలు పోతాయని ద్వాజమెత్తారు.ప్రజలకు నిత్యం ఉపయోగపడే స్కిములను ఎత్తేసిన జగన్ ని కటింగ్ మాస్టరు అంటూ చురకలంటించారు. అన్న క్యాంటీన్, పండుగ కానుక, పెళ్లి కానుక, చంద్రన్న బీమా తదితర పథకాలు కట్ చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చని లోకేష్ అన్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక సీఎం జగనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే 2వేల కిలోమీటర్ల పొడవున పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూశా. భవిష్యత్తులో వారి కన్నీళ్లు తుడుస్తా’ అని లోకేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలను యువతకు కల్పిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని, ఖాళీ పోస్టులు భర్తీచేస్తామని యువతకు భరోసా ఇచ్చారు. ‘ఉమ్మడి ప్రకాశం ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీకి 8అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9మంది ఎమ్మెల్యేలున్నా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు జగన్ పీకిందేమిటి’ అని లోకేశ్ ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు ఏడాదిలో పూర్తిచేస్తానని.. ఇప్పుడు ఆరుసార్లు తేదీలు మార్చారన్నారు. గతంలో జగన్ హామీ ఇచ్చి జిల్లాలో అమలు కాని అభివృద్ధి పనులను నారా లోకేష్ వరుస క్రమంలో ప్రజలకు గుర్తు చేశారు.