కొండపీ : నియోజకవర్గ ఇంచార్జియైన అశోక్ బాబును బహిష్కరించడం అంటే వైయస్సార్ పార్టీ నుండి దళితులను బహిష్కరించడమేనని మాల మహాసభ వ్యవస్థాపకులు అధ్యక్షులు మల్లెల వెంకట్రావు అన్నారు. కొండేపి లోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మూడవ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ బాబుకు సంఘీభావం తెలపడానికి గురువారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా పార్టీలో ఉన్న వారిని ఆ పార్టీ సభ్యత్వం తీసి వేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది అన్నారు. అలా కాకుండా బహిష్కరించడం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీలను పార్టీ నుండి బహిష్కరించడం అనే పదం వాడితే అట్రాసిటీ కేసు కిందకు వస్తుందని చెప్పారు. ఎవరినైనా ఏ పార్టీ, సంఘంలో నుండి తీసి వేయాలంటే కారణాలు తెలుపుతూ మొదట షోకాజ్ నోటీసు ఇవ్వాలని చెప్పారు.
అవి ఏమీ చేయకుండా ఏకపక్ష నిర్ణయంగా బహిష్కరించడం ప్రజాస్వామ్యంలో చెల్లదని అన్నారు. అశోక్ బాబు వ్యాపారాలు, ఉద్యోగాలు వదులుకొని కూడబెట్టుకున్న డబ్బును ఖర్చు పెట్టి నాలుగేళ్లు నియోజకవర్గంలో తిరిగి కష్టపడి పార్టీని బతికిస్తే ఇప్పుడు బహిష్కరిస్తారాని ప్రశ్నించారు. ఆయన వెంట సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమూరి ప్రకాష్, జిల్లా అధ్యక్షులు ఎరిచర్ల సుబ్రహ్మణ్యం ఉన్నారు.
అలాగే ఎరు కుల హక్కుల పోరాట సమితి నాయకులు గోసాల ధర్మ, ఎమ్మార్పీఎస్ జిల్లా విద్యార్థి సంఘం నాయకులు పిడతల అభిషేక్, దళిత కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, జై స్వరాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధురశ్రీ, ముస్లిం మైనార్టీ నాయకులు, సింగరాయకొండ టైలర్ అసోసియేషన్ నాయకులు రాజా, సింగరాయకొండ ముస్లిం మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.