చీరాల (Dn5 News) : మండలంలోని ఈపూరిపాలెం శ్రీ తేజ హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించారు. గత ఏడాది ఫలితాల్లో పాఠశాలలోని 36 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుత ఫలితాల్లో పాఠశాల నుండి పరీక్షకు హాజరైన 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి వరుసగా రెండోసారి నూరు శాతం ఫలితాలను నమోదు చేసుకున్నారు. 46 మందిలో 21 మంది విద్యార్థులు 500కు పైగా మార్పులు సాధించారు. ఈపురుపాలెం సాయి కాలనీకి చెందిన శ్రీ తేజ హై స్కూల్ విద్యార్థి కూరపాటి మనీష్ నందు శ్రీనివాస్ 593 మార్కులతో ప్రథమ శ్రేణిలో నిలిచారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీనివాసరావు అభినందించారు. గ్రామీణ ప్రాంత సాధారణ విద్యార్థులను రాష్ట్రస్థాయి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించారు. అత్యధిక ఫలితాలు సాధించిన విద్యార్థుల ఉత్సాహంతో పాఠశాల వాతావరణం కళకళలాడింది.