Home బాపట్ల ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణి 

ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణి 

35
0

బాపట్ల : నిరుపేదలైన అభాగ్యులను ఎన్టీఆర్ భరోసా పింఛన్ తో ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం నగదు పంపిణీని ఆయన శనివారం బాపట్లలో లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు భీమావారిపాలానికి చేరుకుని జోరున కురుస్తున్న వర్షంలోనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మారిశెట్టి శంకరరావు, జి నాగేశ్వరమ్మకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నెల మొదటి రోజే పింఛన్ నగదు ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

జోరున వర్షం కురిసినప్పటికీ, విపత్తు వచ్చినా లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ చేస్తామని తెలిపారు. ఒకటవ తేదీ ఆదివారం సెలవు దినం రావడంతో సచివాలయం ఉద్యోగులంతా ముందు రోజే నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా సచివాలయాల సిబ్బంది పింఛన్ పంపిణీలో నిమగ్నమయ్యారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వర్షంలో సైతం పింఛన్ పంపిణీ సమర్థంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి పింఛన్ నగదు వేస్తే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడతారని సీఎం గుర్తించి నేరుగా నగదు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. జోరున కురుస్తున్న వర్షంలో తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ నగదు ఇస్తుంటే లబ్ధిదారులు ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు. జిల్లాలో రెండు లక్షల 31 వేల రెండు వందల మంది లబ్ధిదారులకు రూ.96.24కోట్ల నగదు పంపిణీ చేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి వై పిచ్చిరెడ్డి, బాపట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ జిట్టా ప్రమీలారాణి, జనసేన నాయకులు కార్మూరి ఆంజినేష్, టిడిపి నాయకులు శీలం శ్రీనివాసరావు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.