Home బాపట్ల ఉచిత కరెంటుకు దరఖాస్తు చేసుకోండి

ఉచిత కరెంటుకు దరఖాస్తు చేసుకోండి

22
0

చీరాల : రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఎపి చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు మురుగుడు సత్యనారాయణ, దీపాల సత్యనారాయణ, చేతి వృత్తుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి కొండయ్య కోరారు. స్థానికంగా బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం సమావేశంలో వాళ్లు మాట్లాడారు. ఎపి చేనేత కార్మిక సంఘం గత ఎనిమిదేళ్ల నుండి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆందోళనలు చేయడం వలన 2018లో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు 100 యూనిట్లకు జిఒ ఇచ్చారని తెలిపారు.

ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో 2024లో అధికారంలో వచ్చిన తర్వాత మంత్రి సవిత, ఐటీ మంత్రి నారా లోకేష్‌కు చేనేత సమస్యలపై వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 200 యూనిట్లకు ఉచిత కరెంటు, చేనేతపై జిఎస్టి రియంబర్స్‌మెంట్ ఇస్తామని ప్రకటించారని అన్నారు. వీటి అమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులు అందరూ కరెంట్ ఎఈలతో మాట్లాడి దరఖాస్తులు చేసుకుని ఉచిత కరెంటు పొందాలని కోరారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఇంటి కరెంటు బిల్, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఆదాయ దృవీకరణ, చేనేత గుర్తింపు కార్డు, రెండు ఫోటోలు, ఒక తెల్ల కాగితంలో రిక్వెస్ట్ లెటర్ రాసి విద్యుత్‌ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. అలా ఇచ్చిన వాళ్లకు మాత్రమే నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్ ఉచితంగా అమలవుతుందని తెలిపారు. చేనేత కార్మికులు అందరూ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత కరెంటు సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో చేనేత నాయకులు యర్రం రాధా, ఐవి ప్రసాద్, గద్దె బాబు పాల్గొన్నారు.